ప్రజలకు అందుతున్న అత్యవసర వైద్య సేవల నాణ్యతను పరిశీలించేందుకు 108 అంబులెన్స్‌లను మంగళవారం ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాలూరా గ్రామంలో సేవలందిస్తున్న అంబులెన్స్‌ను సందర్శించిన ఆయన, వాహనంలోని వైద్య పరికరాల పనితీరును స్వయంగా పరీక్షించారు. అంబులెన్స్‌లో ఉన్న మందుల నిల్వలను, ముఖ్యంగా మందుల కాలపరిమితి ముగిసిందా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణకు ఉపయోగపడే వైద్య పరికరాల స్థితిగతులను సమీక్షించారు.రోగులను ఆసుపత్రికి తరలించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సకాలంలో స్పందించే విధానంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే 108 సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సాలూరా ప్రాంత ప్రజలకు ఈ అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, ప్రజలు వీటిని ఉచితంగా వినియోగించుకోవాలని కోరారు. అంబులెన్స్ సిబ్బంది అందిస్తున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ శివ దినేష్, అంబులెన్స్ పైలట్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
