మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజామాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో నిర్వహించిన ప్రత్యేక వాహనాల తనిఖీల్లో మొత్తం 134 కేసులు నమోదైనట్లు సీపీ సాయి చైతన్య శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ నెల 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. మొత్తం 134 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పట్టుబడిన వారిని సంబంధిత కోర్టుల్లో హాజరుపరచగా, న్యాయమూర్తులు వారికి కలిపి మొత్తం రూ 12,10,000 జరిమానా విధించినట్లు తెలిపారు.
అలాగే మరో 13 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య వాహనదారులకు పలు కీలక సూచనలు చేశారు. “ప్రజలు తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తూ మద్యం సేవించి వాహనాలు నడపరాదు.
వాహనదారులు తప్పనిసరిగా తమ వెంట వాహనానికి సంబంధించిన పత్రాలను ఉంచుకోవాలి,” అని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించే వారిపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.
