జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశంజిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ (గతంలో 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కమిషనరేట్ పరిధిలోని 58 పరీక్ష కేంద్రాల వద్ద ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సీపీ పేర్కొన్నారు. ప్రధానంగా ఈ క్రింది నిబంధనలను పాటించాలని సూచించారు: పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడటం నిషిద్ధం.
పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ సెంటర్లు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు తప్పనిసరిగా మూసి ఉంచాలి. కేంద్రాల వద్దకు ఎలాంటి నిషేధిత వస్తువులను తీసుకురాకూడదు.
ఈ ఉత్తర్వులు పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు అమలులో ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా తల్లిదండ్రులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
