రెండ్రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వలేదన్న అక్కసుతో.. వీరన్న గుట్టలో ఏకంగా నూర్ అబు బాకర్ మజీద్లోనే కొందరు వ్యక్తులపై మారణాయుధాలతో దాడికి తెగబడిన సర్పంచ్ అభ్యర్థి రిజ్వానా బేగం కొడుకులు సహా నలుగురు వ్యక్తులను రెంజల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు బోధన్ ఏసిపి శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
రెంజల్ మండలంలోని వీరన్న గుట్టకు చెందిన జామీలుద్దీన్, అప్సర్, హైమద్ లు ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి రిజ్వానా బేగానికి మద్దతు ఇవ్వలేదనీ, దీనిని మనసులో పెట్టుకున్న రిజ్వానా బేగం కొడుకులు ఇబ్రహీం, అనూదారులు సిరాజ్, వాజిద్, ఇలియాస్, అవేజ్, ఆరిఫ్, మోయిస్ ఖాన్ మరియు మరికొంతమంది కలిసి పక్కా ప్రణాళికతో చంపాలనే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారనీ తెలిపారు.
శుక్రవారం రోజున రెంజల్ మండలంలోని వీరన్న గుట్ట గ్రామంలోని నూర్ అబు బాకర్ మజీద్ నందు ప్రార్థనలు ముగిసిన వెంటనే, నిందితులు హ్యుందాయ్ కారులో మారణాయుధాలు తీసుకుని వచ్చారు. ప్రార్థనలు పూర్తి కాగానే ‘మీటింగ్ పెడదాం’ అని చెప్పి, హఠాత్తుగా జామీలుద్దీన్, అప్సర్, హైమద్లపై అత్యంత కిరాతకంగా దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితులుగా ఉన్న ఇబ్రహీం, అబూబకర్, వాజిద్, ఆవేజ్ లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ దాడిలో పాల్గొన్న మిగతా నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని ఏసిపి తెలిపారు.
