Thursday, April 16, 2026
HomeTelanganaNizamabadసింగరేణి కార్మికుల శ్రమను దోచుకోవడమే లక్ష్యం...తెలంగాణ సంపదను దోచుకుంటున్న రాక్షస క్రీడ: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు...

సింగరేణి కార్మికుల శ్రమను దోచుకోవడమే లక్ష్యం…తెలంగాణ సంపదను దోచుకుంటున్న రాక్షస క్రీడ: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌ రెడ్డి ఆరోపణలు..

సింగరేణిలో నల్లబంగారు సిరులు పండిస్తున్న కార్మికుల శ్రమను దోచుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల సంపదను దుర్వినియోగం చేస్తూ, ఎవరి మెప్పు కోసం ముఖ్యమంత్రి ఈ ‘రాక్షస క్రీడ’ ఆడుతున్నారని నిలదీశారు.

లియోనెల్ మెస్సీ వర్సెస్ మన గుంపు మేస్త్రీ మధ్య పుట్ బాల్ మ్యాచ్ తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చే ఒక బ్లేమ్ గేమ్ అని విమర్శించారు. శనివారం నగరంలోని బీ ఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మెస్సీ గ్రౌండ్ లో ఫుట్ బాల్ ఆటగాడనీ,రేవంత్ కోర్టులో ఓటుకునోటు కేటుగాడనీ విమర్శలు చేశారు.

మెస్సీతో పుట్ బాల్ మ్యాచ్ హైదరాబాద్ ప్రతిష్ట పెంచే ఈవెంట్ కాదు, కోట్లు కొల్లగొట్టే పేమెంట్ గేమ్ అని ఆయన ఆరోపించారు. రేవంత్ ఆడుతున్న ఈ దొంగాట కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రివై ఉండి ఎమిరేట్స్ టీషర్టు ధరించి ఆ సంస్థను ప్రమోట్ చేస్తావా?, దీని వెనుక దాగి ఉన్న మతలబు ఏమిటి?, ఎమిరేట్స్ సంస్థను ప్రమోట్ చేస్తున్నందుకు నీకు ముట్టే కమిషన్ ల వాటా ఎంత అని సూటిగా ప్రశ్నించారు.

మెస్సీ తో ఫోటో దిగడానికే రూ. 10లక్షలా?.అయితే ఆయన అర్జెంటీనా నుంచి హైదరాబాద్ వచ్చి పుట్ బాల్ ఆడినందుకు ఎన్ని వందల కోట్లు ఇచ్చారనీ అన్నారు. మెస్సీ, ఎమిరేట్స్ తో జరిగిన క్విడ్ ప్రోకోలో రేవంత్ రెడ్డి మెక్కిందెంతని, వీటిపై కేంద్రం విచారణ జరిపేలా రాష్ట్ర బీజేపీ ఎంపీ లు వత్తిడి తేవాలన్నారు. కేంద్ర మంత్రులు రేవంత్ రెడ్డి అవినీతి,అక్రమాల గురించి ప్రధాని మోడీకి, హోం శాఖ మంత్రి అమిత్ షాకు వివరించి సీబీఐ విచారణ జరిపేలా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన ఫార్ములా ఈ-కారు రేసుకేమో అవినీతి అంటగట్టిన రేవంత్ రెడ్డి స్వచ్ఛమైన పాలపొదుగులో విషం ఉందని నమ్మించే కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. నయా పైసా అవినీతి జరగక పోయినా కేటీఆర్‌పై తప్పుడు కేసులు పెట్టీ వేధిస్తున్నారన్నారు. ఫుట్ బాల్ పేరుతో కోట్లు తగలేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సింగరేణి పుడమితల్లి చీకటి గర్భంలో తమ కష్టార్జితాన్ని దుబారా చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై బొగ్గుగని కార్మికవర్గం భగ్గుమంటున్నదని ఆయన పేర్కొన్నారు.


ఒక వైపు గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకుండా సింగరేణి సొమ్మును ఆర్భాటాలకు ఖర్చు చేయడంపై విద్యావేత్తలు, రాజకీయవేత్తల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు.


రేవంత్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయన్నారు. దొంగ హామీలిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన రాహుల్ గాంధీ హామీల మోసాలపై ప్రజలకు క్షమాపణ చెప్పకుండా మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి మ్యాచ్ వీక్షించేందుకు స్పెషల్ ఫ్లైట్ లో రావడం సిగ్గు చేటు అని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు.

డిల్లీ లో జరిగిన బీసీ ల ధర్నాకు రావడానికి తీరికలేని రాహుల్ గాంధీ పుట్ బాల్ మ్యాచ్ వీక్షించేందుకు మాత్రం స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వస్తున్న బీసీ ద్రోహి అని మండిపడ్డారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో ప్రజలు పుట్ బాల్ మ్యాచ్ ఆడుతున్నారని, తొలి విడతలో కాంగ్రెస్ పరుగుకు బ్రేక్ వేస్తూ తొలి గోల్ చేశారని, రెండో విడతలో మరో గోల్ కొట్టి కాంగ్రెస్ ను కంగు తినిపించడానికి గ్రామాలు సిద్ధంగా ఉన్నాయని, మూడో విడతలో మూడో గోల్ కొట్టి కాంగ్రెస్ ను మట్టి కరిపిస్తారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వి.జి గౌడ్,మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!