రెండవ దఫా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు 1120 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 8 మండలాలు, 162 గ్రామపంచాయతీలు, 1114 వార్డులు ఉన్నాయనీ తెలిపారు. ఇక్కడ 2,40,715 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే ఎన్నికల నేపథ్యంలో యంచ, ఇందల్ వాయ్ వద్ద రెండు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి 24/7 వాహనాల తనిఖీలను నిర్వహిస్తున్నారనీ అన్నారు.
అదే విధంగా 59 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అందుకోసం 31 ఎఫ్.ఎస్.టీ (ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్), 6 ఎస్.ఎస్.టీ (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్) బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కింద 4 కేసులలో 166.33 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేశారు. దీని విలువ దాదాపు 97,490/- ఉంటుందన్నారు.
నిజామాబాద్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా మొత్తం 308 మందిని సంబంధిత తహసీల్దారుల ముందు హాజరుపరిచి బైండోవర్ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 11 మంది గన్ లైసెన్సుదారులు ఉంటే, బ్యాంకుకు సంబంధించిన ఒక లైసెన్సు మినహా మిగిలిన 10 గన్ లైసెన్సులను డిపాజిట్ చేయించారు.
విజయోత్సవ ర్యాలీలపై ఆంక్షలు:
ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించరాదని, ఉల్లంఘించిన వారిపై 163 బి.ఎన్.ఎస్.ఎస్. చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలలో ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ర్యాలీలు నిర్వహించినందుకు గాను ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టానాకలన్ గ్రామంలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థ, బందోబస్తుతో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని కమిషనర్ వెల్లడించారు.
