న్యాయస్థానాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఈ నెల 21న నిర్వహించనున్న ‘జాతీయ మెగా లోక్ అదాలత్’ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కోరారు. ‘రాజీ మార్గమే- రాజ మార్గం’ అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తక్కువ సమయంలోనే కేసుల నుంచి విముక్తి పొందవచ్చని సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ చలానాలు, చిన్న తరహా క్రిమినల్ కేసులు, మైనర్ కేసులు, సివిల్ వివాదాలను ఇరుపక్షాల అంగీకారంతో ఇక్కడ పరిష్కరించుకోవచ్చని వివరించారు.
లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల ఉభయ పక్షాలకు ప్రయోజనం చేకూరుతుందని, ఇది పూర్తి శాంతియుత మార్గమని ఆయన పేర్కొన్నారు. పోలీసు స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ కేసుల వివరాలను ఇప్పటికే సిద్ధం చేశామని, కక్షిదారులు సంబంధిత పోలీస్ అధికారులను లేదా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
