రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.
శనివారం ఆయన అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీ.సీ.పీ బస్వారెడ్డి, ఇతర అధికారులతో కలిసి నిజామాబాద్ నగర శివార్లలో తరుచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మాక్లూర్ మండలం మానిక్ బండార్ చౌరస్తా సమీపంలోని సుఖ్ జిత్ స్టార్చ్ మిల్ వద్ద, బోధన్ రోడ్డు లోని ఎన్.ఎన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ఎదురుగా గల ప్రధాన రహదారులను సందర్శించారు. పై ప్రదేశాలలో ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు గల కారణాల గురించి పోలీస్, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు.
ముఖ్యంగా బోధన్ రోడ్ ఎన్.ఎన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వద్ద గడిచిన మూడు సంవత్సరాల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదాలలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఈ సందర్భంగా ప్రమాదాల తీవ్రతపై కలెక్టర్ ఒకింత ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద ఘటనలలో అత్యధిక మరణాలు చోటుచేసున్న వాటిలో నిజామాబాద్ జిల్లాలోని ఈ ప్రాంతం 20వ స్థానంలో ఉందన్నారు.
సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాలలో రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించి, రోడ్డు విస్తరణ పనులు జరిపించాలని ఆర్ అండ్ బీ, పోలీస్ అధికారులకు సూచించారు.
రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలన్నారు. మానిక్ బండార్ సమీపంలోనే కాకుండా, జిల్లా వ్యాప్తంగా గల అన్ని రహదారులపై బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాలలో ప్రమాదాలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మూల మలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి వాటిని సరి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆర్టీసీ బస్ డ్రైవర్లు సహా, ఇతర ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లకు రోడ్డు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించేలా ట్రాఫిక్ నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్నారు.
బ్లాక్ స్పాట్లను పరిశీలించిన అధికారుల బృందంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఎం.వీ.ఐ డి.శ్రీనివాస్, ఆర్ అండ్ బీ అధికారి ప్రవీణ్, ఈదార్ మేనేజర్ హర్ష తదితరులు ఉన్నారు.
