Saturday, April 18, 2026
HomeTelanganaNizamabadయూరియా కష్టాలు..రోడ్డెక్కిన రైతన్న!

యూరియా కష్టాలు..రోడ్డెక్కిన రైతన్న!

కడెం మండల కేంద్రంలో రైతుల భారీ ధర్నా!నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల నిరీక్షణ కన్నీటి పర్యంతమవుతోంది. గత మూడు రోజులుగా గ్రోమోర్ సెంటర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ‘స్టాక్ లేదు’ అనే సమాధానమే వినిపిస్తుండటంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారుల తీరుకు నిరసనగా ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కడెం మండల రైతులకు దక్కాల్సిన యూరియాను అధికారులు పక్కా దారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.చీకటి పడ్డాక గుట్టుచప్పుడు కాకుండా జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన వ్యక్తులకు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

“మా కళ్ల ముందే యూరియా పక్క జిల్లాలకు వెళ్తుంటే.. మా పొలాలు ఎండిపోవాలా?” అంటూ రైతులు నిలదీశారు.రైతుల ఆందోళనతో ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఏడీఏ సుజాత, ఎస్సై సాయికిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు.

తక్షణమే మండల రైతులకు సరిపడా యూరియా స్టాక్‌ను అందుబాటులోకి తీసుకురావాలని, అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సమస్యను పరిష్కరిస్తామని, నిష్పక్షపాతంగా యూరియా పంపిణీ జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.అయినప్పటికీ, అధికారులు క్షేత్రస్థాయిలో స్పందించి యూరియా కొరత తీర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!