ఎముకలు కొరికే చలిలో ట్యాంకులు కడిగిస్తున్న వైనం.. నిబంధనలు గాలికి!అమ్మ నాన్నలకు దూరంగా, ఉజ్వల భవిష్యత్తు కోసం వసతి గృహాల్లో చేరుతున్న నిరుపేద విద్యార్థుల జీవితాలతో ఒక బాధ్యతాయుత అధికారి ఆటలాడుకుంటున్నారు. విద్య నేర్పించి ప్రయోజకులను చేయాల్సిన చేతులతో..
అత్యంత ప్రమాదకరమైన రీతిలో నీళ్ల ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బీసీ ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహంలో వార్డెన్ మచ్చేందర్ సాగిస్తున్న అక్రమాలు, నిర్లక్ష్యం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎముకలు కొరికే చలి తీవ్రత పెరిగింది.
ఇలాంటి సమయంలో విద్యార్థులకు వెచ్చని ఆశ్రయం కల్పించాల్సింది పోయి, రెండంతస్తుల భవనం పైకి ఎక్కించి నీళ్ల ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నారు. భవనం అంచున ఉన్న ఆ ట్యాంకుల వద్ద పసిపిల్లలు ఏమరపాటున కాలు జారితే పరిస్థితి ఏమిటని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాల్సిన పిల్లలను ఇంటి పనులకు, హాస్టల్ చాకిరీకి వాడుకుంటూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వార్డెన్ మచ్చేందర్ తీరుపై గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న ఈయన.. ఆ పలుకుబడితో విధులకు సరిగ్గా హాజరు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి.
విద్యార్థులకు అందాల్సిన కాస్మోటిక్ చార్జీలను వారి ఖాతాల్లో వేయకుండా సొంతానికి వాడుకుంటున్నారని విద్యార్థులు స్వయంగా ఆరోపిస్తున్నారు. హాస్టల్ కు వచ్చే బియ్యం తరలింపులో అవకతవకలు, నాణ్యత లేని భోజనం, వెలగని లైట్లు, అపరిశుభ్రమైన బాత్రూంలతో వసతి గృహం నరకాన్ని తలపిస్తోంది.
సమస్యలను అడిగితే విద్యార్థులను పరుష పదజాలంతో దూషించడం, విద్యార్థి సంఘాల నాయకులపై దుర్భాషలాడటం ఈయనకు నిత్యకృత్యంగా మారింది.రాజకీయ అండదండలతోనే అక్రమాలు?గత ప్రభుత్వంలోని ఒక కీలక ప్రజాప్రతినిధి అండదండలతోనే మచ్చేందర్ ఇన్ని అక్రమాలకు తెగబడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
చివరకు తాను నివసిస్తున్న ఇల్లు కూడా మామిడిపల్లిలోని ఒక వెంచర్లో పార్కు కోసం కేటాయించిన స్థలంలో నిర్మించుకున్నారని, దీనిపై గతంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున గొడవకు దిగారని సమాచారం. గతంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఉదయ్ భాస్కర్ గారు తనిఖీలు చేసినా, ఏసీబీ దాడులు జరిగినా ఈ అధికారి తీరులో మార్పు రాకపోవడం గమనార్హం.
ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా, ఇలాంటి అధికారుల వల్ల పథకాల లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెడుతున్న వార్డెన్ మచ్చేందర్ పై విచారణ జరిపి, తక్షణమే విధులనుండి తొలగించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
