రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ కీలక నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై దిశానిర్దేశం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
గత సాధారణ ఎన్నికల్లో సాధించిన ఉత్సాహాన్ని మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించి, నిజామాబాద్ జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జీగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు.
అభ్యర్థుల ఎంపికలో సర్వేలు, వారికున్న ప్రజాదరణనే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. విపక్షాల తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ, అభివృద్ధి ప్రాతిపదికన ఓట్లు అడగాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, కేశ వేణు సహా పలువురు నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
