నామినేషన్ల గడువు ముగుస్తున్నా తప్పని తిప్పలుమున్సిపల్ ఎన్నికల వేళ అభ్యర్థులకు కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తుండగా, మరోవైపు అవసరమైన పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
ముఖ్యంగా ఇంటి పన్ను, నల్లా పన్ను బకాయిలు లేవని ధృవీకరించే ‘నో డ్యూ’ సర్టిఫికేట్ల కోసం అభ్యర్థులు నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. బుదవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ఊపందుకోవడంతో అభ్యర్థుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది.
అయితే, మున్సిపల్ కార్యాలయంలో సర్వర్లు తరచూ మొరాయిస్తుండటంతో ధృవీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆన్‌లైన్‌లో వివరాల నమోదులో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఒక్కో సర్టిఫికేట్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నామినేషన్ వేయడానికి సమయం తక్కువగా ఉండటం, పత్రాలు చేతికందకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. పాత బకాయిలు లేకున్నా, రికార్డుల్లో పెండింగ్‌గా చూపిస్తుండటంతో అభ్యర్థులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు.
క్షేత్రస్థాయిలో పన్నులు చెల్లించినా, ఆన్‌లైన్ డేటా అప్‌డేట్ కాకపోవడం శాపంగా మారింది. “రేపటితో గడువు ముగుస్తోంది, ఇప్పటికీ సర్టిఫికేట్ రాలేదు.. అధికారులు స్పందించాలి” అంటూ పలువురు అభ్యర్థులు కార్యాలయం ఆవరణలో ఆందోళన వ్యక్తం చేశారు.
అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి సకాలంలో సర్టిఫికేట్లు అందజేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల అధికారులు స్పందించి నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూడాలని కోరుతున్నారు.
