మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజామాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన వారం రోజుల్లో కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి.
ఈ వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జనవరి 27 నుండి 31 వరకు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా మొత్తం 84 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు వీరందరినీ సంబంధిత కోర్టుల్లో హాజరుపరచగా, న్యాయస్థానం వీరికి మొత్తం రూ. 7,90,000/- భారీ జరిమానా విధించినట్లు తెలిపారు.
అలాగే ఐదుగురికి కోర్టు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: ప్రాణాపాయంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
