ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పట్టణ శివార్లలోని బర్దిపూర్ – కేశపూర్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ కమిషనర్ కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.వాహనాల మళ్లింపు ఇలా..సభకు వచ్చే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనదారుల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు:
ఆర్మూర్, డిచ్పల్లి వైపు నుంచి వచ్చే వారు:
ఆర్మూర్, జక్రాన్ పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి మీదుగా వచ్చే వాహనాలు NH-44 వెంబడి ప్రయాణించి.. నడిపల్లి, ఎం.ఎన్.ఆర్ గెస్ట్ హౌస్ వద్ద ‘U’ టర్న్ తీసుకోవాలి. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న నారాయణ కాలేజీ వద్ద కేటాయించిన పార్కింగ్ స్థలానికి చేరుకోవాలి.
మాక్లూర్, నందిపేట్ మార్గం:
ఈ వైపు నుంచి వచ్చే వాహనాలు మాణిక్ బండార్ చౌక్ నుంచి అమ్రాద్, ఓడ్డేటిపల్లి, కేశపూర్ మీదుగా ప్రయాణించి త్రిమూర్తి కోల్డ్ స్టోరేజ్ సమీపంలోని పార్కింగ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
బోధన్ ప్రయాణికులు:
బోధన్ వైపు నుంచి వచ్చే వాహనాలు అర్సపల్లి జంక్షన్, రైల్వే గేటు, కొత్త కలెక్టరేట్, కంటేశ్వర్ బైపాస్, మాధవనగర్ బైపాస్ మీదుగా కేశపూర్ కమాన్ చేరుకుని, అక్కడ సుధీర్ రెడ్డి కాలేజీ పార్కింగ్‌లో వాహనాలను నిలపాలి.
వర్ని, చందూర్ మార్గం:
వర్ని ఎక్స్ రోడ్డు నుంచి వచ్చే వారు పులాంగ్ జంక్షన్, రుక్మిణి చాంబర్, బోర్గం బ్రిడ్జి, మాధవనగర్ రైల్వే గేటు మీదుగా కేశపూర్ కమాన్ చేరుకుని సుధీర్ రెడ్డి కాలేజీ పార్కింగ్‌ను ఉపయోగించుకోవాలన్నారు.
అదేవిధంగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ వైపు వెళ్లే సాధారణ ప్రయాణికులకు ఎటువంటి మార్పులు లేవు. యధావిధిగా ప్రయాణించవచ్చు అని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
