HomeTelanganaNizamabadఏడేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? బిజెపి ఎంపీకి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ సవాల్..

ఏడేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? బిజెపి ఎంపీకి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ సవాల్..

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై గాంధీ చౌక్ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమా అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్‌కు సవాల్ విసిరారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన ఏడేళ్ళలో ఎంపీగా అరవింద్ జిల్లాకు తెచ్చిన నిధులు ఏంటని ఆయన నిలదీశారు.

“బీజేపీ నేతలు అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో లేరు. అందుకే కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలైన ముద్ర స్కీమ్ జిల్లాలో నత్తనడకన సాగుతుంటే, ఖేలో ఇండియా కింద ఒక్క ప్రాజెక్టునైనా తీసుకువచ్చారా?” అని సూటిగా ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలోనే జిల్లా ముఖచిత్రం మారిందని పేర్కొన్నారు. జిల్లాకు మూడు ఇంటిగ్రేటెడ్ కళాశాలలతో పాటు వ్యవసాయ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. రేపు (శుక్రవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని వెల్లడించారు. కార్పొరేటర్ అభ్యర్థి వంశీ (హోటల్ నరేందర్ రెడ్డి) రూ. 8 కోట్ల బకాయిల అంశంపై ఆయన వివరణ ఇచ్చారు.

హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం వల్లే గతంలో ఆ సొమ్ము చెల్లించలేదని, అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘నో డ్యూ సర్టిఫికెట్’ కోసం పార్టీ ఆదేశాల మేరకే ఇప్పుడు ఆ నగదు చెల్లించినట్లు స్పష్టం చేశారు.

లక్ష్యం మేయర్ పీఠం..

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “80 శాతానికి పైగా సీట్లతో నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.

కాంగ్రెస్ పార్టీకి బిజెపి ఎంత దూరమో, ఎంఐఎం కూడా అంతే దూరం” అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామక్రిష్ణ, తాహిర్ బిన్ హందాని, ఆకుల లలిత, కేశ వేణు, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments