ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విభజన రాజకీయాలకు తెరలేపుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య విబేధాలు సృష్టించి వివక్ష చూపిస్తోందని అన్నారు.
“బీజేపీకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి అహ్మదాబాద్ వరకు దేశమంతా ఒక్కటే. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోంది” అని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ సహా బీజేపీ నేతలపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 12 ఏళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో తమ వద్ద స్పష్టమైన చిట్టా ఉందని రామచందర్ రావు పేర్కొన్నారు.
“అమృత్ పథకం కింద నిజామాబాద్ అభివృద్ధి, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు.. ఇవన్నీ కేంద్రానివే. మరి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం ఇచ్చిందో చెప్పాలి?” అని సవాల్ విసిరారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకోబట్టే కాంగ్రెస్ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో పాలన కుంటుపడిందని విమర్శించారు.ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి? వాటి అమలుకు నిధులు లేవు కానీ, కమిషన్లకు మాత్రం నిధులు ఉంటాయా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఊసేది? విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్ పెరిగిపోయింది.
ఐఎస్ఐ ఏజెంట్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుమారు 40 మంది నిరుద్యోగులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, పోలీసులను అడిగితే ఆ లెక్కలు తెలుస్తాయనీ అన్నారు.
చనిపోయిన వారిపై కనీసం సానుభూతి కూడా చూపని ప్రభుత్వం, మజ్లిస్ పార్టీతో కుమ్మక్కై బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్,అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి,పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
