HomeTelanganaNizamabadపాత పద్ధతిలోనే పసుపు కొనుగోళ్లు! ఈ-నామ్ 2.0 సాంకేతిక ఇబ్బందులపై ఎంపీ అర్వింద్ సీరియస్

పాత పద్ధతిలోనే పసుపు కొనుగోళ్లు! ఈ-నామ్ 2.0 సాంకేతిక ఇబ్బందులపై ఎంపీ అర్వింద్ సీరియస్

  • ఢిల్లీ జాయింట్ సెక్రెటరీతో చర్చలు.. పాత వెర్షన్‌కే మొగ్గు
  • నేటి నుంచి యథావిధిగా లావాదేవీలు.. రైతుల్లో హర్షం

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పసుపు కొనుగోళ్లకు సంబంధించి నెలకొన్న సాంకేతిక ప్రతిబంధకాలు తొలగిపోయాయి. గత కొద్దిరోజులుగా ‘ఈ-నామ్ 2.0’ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ కారణంగా రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ తక్షణమే స్పందించారు.

ప్రస్తుత సీజన్ ముగిసే వరకు పాత పద్ధతిలోనే (ఈ-నామ్ 1.0) కొనుగోళ్లు జరపాలని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరగా, దానికి సానుకూల స్పందన లభించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ-నామ్ 2.0 వెర్షన్‌లో రైతులకు లాట్ ఐడీల జారీ ప్రక్రియ భారంగా మారింది. ముఖ్యంగా మొబైల్ నంబర్ల ఎంట్రీ తప్పనిసరి చేయడం, నెట్‌వర్క్ నెమ్మదించడంతో వేలం ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ అంశాన్ని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మరియు స్థానిక వ్యాపారస్తులు బుధవారం ఎంపీ అర్వింద్ దృష్టికి తీసుకెళ్లారు.

పసుపు రాక అధికంగా ఉన్న సమయంలో ఇటువంటి సాంకేతిక అడ్డంకులు రైతులకు శాపంగా మారుతున్నాయని వారు వివరించారు. సమస్య తీవ్రతను గమనించిన ఎంపీ అర్వింద్ వెంటనే ఢిల్లీలోని ఈ-నామ్ జాయింట్ సెక్రెటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్మయి గోత్మారేతో చరవాణిలో సంభాషించారు. సీజన్ ముగిసే వరకు ఈ-నామ్ 1.0ని కొనసాగించాలని, కొత్త వెర్షన్‌లోని లోపాలను తదుపరి దశలో సరిదిద్దాలని కోరారు.

ఎంపీ విజ్ఞప్తికి స్పందించిన జాయింట్ సెక్రెటరీ, వెంటనే పాత సాఫ్ట్‌వేర్ ద్వారానే కొనుగోళ్లు జరిపేలా మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు పూర్తి చేయడంతో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా మొదలైంది.

సకాలంలో స్పందించి, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను కొలిక్కి తెచ్చిన ఎంపీ అర్వింద్‌కు మార్కెట్ అధికారులు, వ్యాపారస్తులు మరియు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల వేలం ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగే అవకాశం ఏర్పడింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments