రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు.
పోలీస్ కమిషనర్ పి. సాయిచైతన్య ఆదేశాల మేరకు కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, ఏసీపీ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా శ్రమదానం చేశారు. కార్యాలయ ప్రాంగణాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు.
ప్రజలకు సేవలందించే పోలీస్ స్టేషన్లు ఆహ్లాదకరంగా, పరిశుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
