.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పిలుపుకాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కేవలం మాటల గారడీయేనని, ఇది అచ్చంగా ‘దగాకోరు’ బడ్జెట్ అని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ధ్వజమెత్తారు.
శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. బడ్జెట్‌లో ఆ హామీలను పాతాళంలో పాతేసిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై పెద్దపెద్ద మాటలు చెప్పారని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తెరిపిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
ఈ బడ్జెట్‌లో చక్కెర ఫ్యాక్టరీల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం జిల్లా రైతాంగాన్ని వంచించడమేనన్నారు. మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ. 1,500 కోట్లు కేటాయించిన సర్కారుకు, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కనిపించడం లేదా అని నిలదీశారు.
గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు, మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం అందిస్తామన్న హామీలు అటకెక్కాయని ఆయన మండిపడ్డారు. బడ్జెట్‌లో గల్ఫ్ బాధితులకు చిల్లిగవ్వ కేటాయించకపోవడం వారిని నట్టేట ముంచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు ఇచ్చి, జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీని విస్మరించడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అని విమర్శించారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రస్తావన తెచ్చిన మంత్రి భట్టి, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న జక్రాన్‌పల్లి విమానాశ్రయాన్ని ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు.
ప్రాణహిత-చేవెళ్ల (ప్యాకేజీ 21, 22), మంచిప్ప రిజర్వాయర్ పనులకు నిధులు సున్నా అని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌కు రింగ్ రోడ్డు ఇస్తామని స్వయంగా సిఎం ఇచ్చిన హామీ బడ్జెట్‌లో ఆవిరైపోయిందన్నారు. గారడీ మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, బడ్జెట్ సాక్షిగా ప్రజల గొంతు కోసింది.
ఇది రైతు, యువత, ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని ఆయన విమర్శించారు.
23న కలెక్టరేట్ ముట్టడి
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ మార్చి 23న ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ నిరసనలో జిల్లాలోని పార్టీ శ్రేణులు, రైతులు, బాధితులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పొతన్ కార్ లక్ష్మీనారాయణ, బొబ్బిలి వేణు, విజయ్ కృష్ణ, ఆనంద్, శీను తదితరులు పాల్గొన్నారు.
