నగరంలో హనుమాన్ విజయోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. హిందూవాహిని, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర భక్తి పారవశ్యం మధ్య అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రంగురంగుల జెండాలు, కేసరి వర్ణపు పతాకాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది
కంటేశ్వర్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ భారీ శోభాయాత్రను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ ఉమారాణి , బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, నూడ చైర్మన్ కేశ వేణు, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక వేడుకలు సమాజంలో సోదరభావాన్ని పెంచుతాయని కొనియాడారు.శోభాయాత్ర ప్రారంభం కాగానే యువత పెద్ద ఎత్తున ‘రామ్ లక్ష్మణ్ జానకి.. జై బోలో హనుమాన్ కి’ అంటూ చేసిన నినాదాలతో పురవీధులు మారుమోగాయి.
యువకులు డీజే ముందు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ యాత్రలో ముందుకు కదిలారు. కంటేశ్వర్ ఆలయం నుంచి మొదలైన ఈ శోభాయాత్ర జిల్లా పరిషత్, నాందేవాడ, రైల్వే ఓవర్ బ్రిడ్జి, గాంధీ చౌక్, నెహ్రూ పార్కు, పెద్ద బజార్ మీదుగా సాగి శివాజీ చౌరస్తా వద్ద ముగియనుంది.
ఈ మార్గమంతా వేలాది మంది భక్తులు, యువకులు తరలివచ్చి హనుమాన్ నామస్మరణ చేశారు.యాత్ర నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది.1300 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
యాత్ర సాగే మార్గాల్లో ప్రతి అడుగునూ సీసీ కెమెరాల ద్వారా నిశితంగా పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా వాహనాలను మళ్లించారు.ఈ కార్యక్రమంలో హిందూవాహిని, బజరంగ్ దళ్ ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు మరియు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
