నగరంలోని టీసీఎస్ నంబర్-2 కల్లు డిపోను వెంటనే తెరిపించి, కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరుతూ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు అబ్కారీ శాఖ ఉన్నతాధికారులకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు డిపో అధ్యక్షుడు గొట్టిపాటి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో సభ్యులు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిని, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, జిల్లా అధికారి మల్లారెడ్డి, సీఐ స్వప్నలను కలిసి తమ సమస్యను వివరించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. గత రెండున్నర దశాబ్దాలుగా సుమారు 500 గీత కార్మిక కుటుంబాలు ఈ సొసైటీపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. గత కొంతకాలంగా సభ్యుల మధ్య తలెత్తిన అంతర్గత విభేదాల కారణంగా అధికారుల ఆదేశాల మేరకు డిపోను తాత్కాలికంగా మూసివేసినట్లు గుర్తుచేశారు.
ప్రస్తుతం ఆ విభేదాలన్నీ పరిష్కారమయ్యాయని, భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా సొసైటీని నిర్వహిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. కార్మికుల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, డిపో నిర్వహణకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని వారు కోరారు.
దీనిపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీహరి గౌడ్, దుర్గా గౌడ్, అంజగౌడ్, బసవగౌడ్, సంపత్ కుమార్ గౌడ్, గంగాధర్ గౌడ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
