నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లాలోని సిఎస్ఐ, హెబ్రోను, ఎజీ చర్చిలతో పాటు అన్ని క్రైస్తవ ప్రార్థనా మందిరాలలో విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసుక్రీస్తు సిలువ బలిదానాన్ని స్మరించుకున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని అగాపే వర్షిప్ సెంటర్‌లో కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా విశేషమైన ఆరాధనలు నిర్వహించగా, పరిసర గ్రామాల నుండి భారీ సంఖ్యలో క్రైస్తవులు హాజరై భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ జాన్ మాట్లాడుతూ, సర్వ మానవుల పాప ప్రాయశ్చిత్తం కోసం నిరాకారుడైన దేవుడు సుమారు 2000 సంవత్సరాల క్రితం మానవ రూపంలో యేసుక్రీస్తుగా అవతరించాడని తెలిపారు.
ఆయన సిలువపై చిందించిన రక్తం ద్వారా మానవాళికి విమోచనం కలిగిందని వివరించారు. ఇక జిల్లాలోని సీఎస్ఐ, హెబ్రోను, గొల్గోత, మన్నా వంటి ప్రార్థనా మందిరాలలో కూడా గుడ్ ఫ్రైడే ఆచరణలు ఘనంగా జరిగాయి.
