మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజామాబాద్ పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. ‘మత్తులో వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు’ అని హెచ్చరిస్తున్నా కొందరి తీరులో మార్పు రావడం లేదు.
కమిషనరేట్ పరిధిలో గత వారం రోజులుగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఏకంగా 151 మంది పట్టుబడినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మే 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో దొరికిన 151 మందిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరిచారు.
మద్యం మత్తులో మితిమీరిన రీతిలో వాహనాలు నడిపిన 11 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తులు తీర్పునిచ్చారు. మిగిలిన వాహనదారుల నుంచి మొత్తం రూ. 10,40,000 జరిమానా వసూలు చేసినట్లు సీపీ తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వాహనదారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా సవరించిన మోటార్ వెహికల్ యాక్ట్-2019 ప్రకారం నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయని గుర్తుచేశారు. మొదటిసారి పట్టుబడితే రూ. 10,000, రెండోసారి దొరికితే రూ. 15,000 జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. మద్యం తాగి ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ వర్తించదు.మైనర్లు తాగి వాహనం నడిపితే, సదరు మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా చార్జిషీట్ నమోదు చేస్తారు.
కమిషనరేట్ పరిధిలోని అన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సీపీ స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలను కలిగి ఉండాలని, మద్యం సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
