నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట గ్రామంలో ఓ వ్యక్తి తన నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన పబ్బ రవిగౌడ్ (40) గత కొంతకాలంగా భార్య, పిల్లలతో కలిసి కొత్తపేటలో నివాసముంటున్నాడు.
రవిగౌడ్కు అప్పుడప్పుడు మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవపడే అలవాటు ఉంది. కాగా, రవిగౌడ్ భార్య అనారోగ్య సమస్యల కారణంగా ఈ నెల 14న చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. పిల్లలు కూడా ఆమెతోనే ఆసుపత్రిలో ఉంటున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సమయంలో రవిగౌడ్ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో శవమై పడి ఉన్నట్లు సమాచారం అందింది. బంధువులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.
భార్య, పిల్లలు ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.దీనిపై మృతుడి తమ్ముడు పబ్బ అశోక్ (వేములవాడ నివాసి) తన అన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
