నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లే కాకుండా, జనసంచారం తక్కువగా ఉన్న వీధులను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలోని నాలుగో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో గల పద్మానగర్ కాలనీలో మంగళవారం రాత్రి ఓ గుర్తుతెలియని దుండగుడు మూడు ఇళ్లలో చోరీకి పాల్పడి కలకలం సృష్టించాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. పద్మానగర్ రోడ్ నంబరు 2, 3 పరిధిలోని ఇళ్లలోకి అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 11:30 నుంచి 12 గంటల మధ్య) ఓ దుండగుడు చొరబడ్డాడు. మొదటగా స్థానికంగా ఉంటున్న తల్లి, కూతురి ఇంట్లోకి ప్రవేశించిన సదరు వ్యక్తి, ఇంట్లో ఉన్న 3 గ్రాముల బంగారు నగలు, రూ.10 వేల నగదును కాజేశాడు. అక్కడి నుంచి నేరుగా పక్క వీధిలో ఉన్న మరో ఇంట్లోకి దూరి రెండున్నర తులాల బంగారాన్ని అపహరించాడు.
ఆ తర్వాత అదే వీధిలోని మరో ఇంట్లో నివాసముంటున్న వృద్ధ దంపతులను భయపెట్టి, వారి వద్ద ఉన్న రూ.3,500 నగదును లాక్కుని అక్కడి నుంచి పరారయ్యాడు.ఒకే రాత్రి కొద్ది నిమిషాల వ్యవధిలోనే మూడు ఇళ్లలో వరుసగా దొంగతనం జరగడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
బాధితుల నుంచి సమాచారం అందుకున్న నాలుగో టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు కాలనీలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
