HomeHEALTHపేద రోగులకు పెద్ద దిక్కుగా.. ప్రభుత్వ ఆసుపత్రి!ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం.. పేదలకు అభయహస్తం!

పేద రోగులకు పెద్ద దిక్కుగా.. ప్రభుత్వ ఆసుపత్రి!ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం.. పేదలకు అభయహస్తం!

ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే జనం జంకేవారు. కేవలం సాధారణ జబ్బులకే పరిమితమైన ఆసుపత్రి, ఇప్పుడు అత్యాధునిక చికిత్సతో ‘పేద రోగులకు పెద్ద దిక్కుగా మారింది.ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన మార్పులు ఇప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి.

ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధం, నిపుణులైన వైద్యుల రాకతో ఇక్కడ అందుతున్న సేవలు సామాన్యులకు వరంలా మారాయి. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా, గుండె శస్త్రచికిత్సలు, ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులోకి రావడంతో పేద రోగులకు పెద్ద దిక్కుగా నిలుస్తోంది.

ఆసుపత్రికి నిత్యం సుమారు 2,000 మందికి పైగా రోగులు వస్తుండగా, దాదాపు 500 మంది వరకు ఇన్-పేషెంట్లుగా చేరుతున్నారు.గతంలో కార్డియాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు లేక రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీసేవారు.

ఆర్థిక స్తోమత లేక ఎంతోమంది ఇబ్బందులు పడేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రైవేటు ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని రీతిలో, అధునాతన పరికరాలు, నిపుణులైన వైద్యులతో గుండెకు స్టెంట్లు, ప్లాస్టిక్ సర్జరీలు చేస్తూ ఆసుపత్రి వైద్యులు పేదలకు అభయహస్తంగా నిలుస్తున్నారు.

అసాధ్యమనుకున్న అనేక శస్త్రచికిత్సలను విజయవంతంగా చేస్తూ, ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని పోగొడుతున్నారు. గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చే రోగులకు ‘క్యాథ్ ల్యాబ్’ ప్రాణవాయువులా పనిచేస్తోంది. ఆసుపత్రి చరిత్రలో తొలిసారిగా ప్లాస్టిక్ సర్జరీ విభాగం సత్తా చాటింది.

ముఖంపై క్యాన్సర్ గడ్డతో నరకం అనుభవిస్తున్న 45 ఏళ్ల లచ్చవ్వకు ‘రొటేషన్ ఫ్లాప్ రీకన్స్ట్రక్షన్’ అనే అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అలాగే ఇటీవల గుండెపోటుతో తీవ్ర అనారోగ్యానికి గురైన 65 ఏళ్ల వృద్ధుడికి, వైద్యులు సమయస్ఫూర్తితో స్పందించి పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియను అత్యంత విజయవంతంగా పూర్తి చేశారు. క్లిష్టమైన సమయంలో వేగంగా స్పందించి ప్రాణాలు కాపాడటంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న ఈ ఉన్నత స్థాయి వైద్య సేవలతో పేదలకు ఆర్థిక భారం తప్పడమే కాకుండా, మెరుగైన వైద్యం అందుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పేదలకు కార్పొరేట్ వైద్యం: డాక్టర్ నాగ మోహన్ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా మా వైద్య బృందం పనిచేస్తోంది. ఒకప్పుడు ఇక్కడ అందుబాటులో లేని కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ సేవలను ఇప్పుడు ప్రజలకు చేరువ చేశాం.

క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తూ, రోగుల ప్రాణాలను కాపాడుతున్నాం. నిరంతరం అధునాతన సౌకర్యాలను కల్పిస్తూ ఆసుపత్రిని మరింత బలోపేతం చేస్తాం” అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments