మరణానికి గౌరవం, మానవత్వానికి జీవం పోస్తూ, ఎవరూ లేని అనాథ శవాలకు వారు అంతిమ వీడ్కోలు పలికారు. సమాజంలో కుటుంబ సభ్యులకు దూరమై, అనారోగ్యంతోనో లేదా ఇతర కారణాలతోనో అనాథలుగా మరణిస్తున్న వారిని కడసారి చూసేవారు కూడా కరువవుతున్నారు.
ఇలాంటి హృదయవిదారక పరిస్థితుల్లో వారిని అనాథలుగా వదిలేయకుండా, మానవతా దృక్పథంతో ఇందూరు యువత సంస్థ ముందుకు వస్తోంది. పోలీసుల అనుమతితో అనాథ శవాలకు శాస్త్రోక్తంగా, గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.
ఈ క్రమంలోనే శుక్రవారం నిజామాబాద్‌లోని దేవీ థియేటర్ పక్కన గల సార్వజనిక్ శ్మశాన వాటికలో, మరణించిన ఇద్దరు అనాథల మృతదేహాలకు 1వ టౌన్ పోలీసుల పర్యవేక్షణలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మనిషి జననం ఎంత పవిత్రమో, మరణం తర్వాత వీడ్కోలు కూడా అంతే గౌరవప్రదంగా ఉండాలనే ఉద్దేశంతో సంప్రదాయాలను పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు, 1వ టౌన్ పోలీస్ సిబ్బంది భాస్కర్, సంస్థ సభ్యులు అఫ్రోజ్, ఇందురి శేఖర్, రాజశేఖర్, అమృత్ తదితరులు పాల్గొన్నారు.
