జేసీబీలతో రాత్రింబవళ్లు మొరం తవ్వకాలు..అక్రమ వెంచర్లకు తరలిపోతున్న సంపద..మైనింగ్, రెవెన్యూ శాఖల ప్రేక్షకపాత్ర..జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మోపాల్ మండలం సిర్పూరు గ్రామ శివారు ఇప్పుడు అక్రమార్కులకు వరంగా మారింది.
మైనింగ్ శాఖ తీరు ‘తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత’ అన్న చందంగా మారడంతో.. ఇక్కడి రామన్న చెరువు గర్భం నిలువునా గుల్లవుతోంది. అధికార పార్టీకి చెందిన ఒక కీలక నేత అండదండలు పుష్కలంగా ఉండటంతో, కొందరు వ్యక్తులు చట్టాన్ని, అధికారులను ఏమాత్రం లెక్కచేయకుండా యథేచ్ఛగా మొరం, నల్లమట్టి దోపిడీకి తెరలేపారు.గ్రామస్థాయిలో ఎలాంటి అనుమతులు లేకపోయినా, ఉన్నతాధికారుల కళ్లుగప్పి పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు.
ఇక్కడి నుంచి తరలుతున్న వందలాది లారీల మొరాన్ని చుట్టుపక్కల వెలుస్తున్న అక్రమ వెంచర్ల పూడికకు తరలిస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ‘మాకు రాజకీయ అండ ఉంది.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అన్న ధీమాతో పగలే యంత్రాలు పెట్టి తవ్వుతుండటం అక్రమార్కుల బరితెగింపునకు అద్దం పడుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో అతిగా, లోతుగా తవ్వకాలు జరపడం వల్ల గతం నుంచే ఇక్కడ విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
గతంలో ఈ అక్రమ గుంతల వల్ల చెరువులో లోతు పెరిగి పశువుల కాపరులు, మత్స్యకారులు ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు కోల్పోయారు.
కళ్లముందే సామాన్యుల ప్రాణాలు పోతున్నా, కనీసం మానవత్వం లేకుండా అక్రమార్కులు తమ లూటీని కొనసాగిస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కళ్లముందే ఇంత పెద్ద ఎత్తున సహజ వనరుల దోపిడీ జరుగుతున్నా, బాధ్యతాయుతమైన రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు ఉండటం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? లేక మరేదైనా మతలబు ఉందా? అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సిర్పూరు శివారులో సాగుతున్న అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
