రెండు కుటుంబాల మధ్య మొదలైన గొడవ, చిలికి చిలికి గాలివానలా మారి రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీసింది.ఈ ఘటన ఇందల్వాయి మండల పరిధిలోని తిరుమల నాయక్ తండాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనతో తండాలో భయాందోళనలు నెలకొన్నాయి. డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నిర్మల జ్యోతి, ఆమె భర్త సురేందర్ (7వ బెటాలియన్ కానిస్టేబుల్) గత కొంతకాలంగా మనస్పర్థల కారణంగా విడిపోయి ఉంటున్నారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి నిర్మల జ్యోతికి, ఆమె భర్త సురేందర్‌కు ఇందల్వాయిలో గొడవ జరిగింది. ఈ సమయంలో సురేందర్‌పై నిర్మల జ్యోతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. దీంతో పరిస్థితి చేయిదాటింది.
తమ కుటుంబ సభ్యులను తిరుమల నాయక్ తండాలో బంధించి కొడుతున్నారని నిర్మల జ్యోతి డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన డిచ్పల్లి సీఐ, ఎస్సై సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
నిర్మల జ్యోతి తండ్రిని, తమ్ముడిని రక్షించి జీపులోకి ఎక్కించారు. పోలీసులు బాధితులను రక్షించి జీపులో తీసుకెళ్తుండగా, తిరుమల నాయక్ తండా గ్రామస్థులు ఒక్కసారిగా ఎదురుతిరిగారు. జీపును ముందుకు కదలనీయకుండా చుట్టుముట్టారు. కొందరు గ్రామస్థులు ఏకంగా పోలీస్ వ్యాను ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల కళ్లలో కారం చల్లి దాడి చేశారు. జీపులో ఉన్న మహిళను బలవంతంగా కిందకు దించి కొట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఘటన సమాచారం అందుకున్న రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్, ఎస్సై ఆరిఫ్ తన సిబ్బందితో కలిసి భారీగా బలగాలతో గ్రామానికి చేరుకున్నారు.
తీవ్ర ప్రయత్నాల అనంతరం పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.
ఈ గొడవ ఇందల్వాయి మండలంతో పాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
