HomeCRIMEమాతా శిశు ఆసుపత్రిలో నిద్దుర పోతున్న నిఘా వ్యవస్థ.. అభద్రతలో పసిబిడ్డలు!శిశువుల రక్షణ గాలిలో.. తల్లిదండ్రులు...

మాతా శిశు ఆసుపత్రిలో నిద్దుర పోతున్న నిఘా వ్యవస్థ.. అభద్రతలో పసిబిడ్డలు!శిశువుల రక్షణ గాలిలో.. తల్లిదండ్రులు భయం గుప్పిట్లో!తాగుబోతుల అడ్డాగా మారుతున్న ఆసుపత్రి..

నిజామాబాద్ నూతన మాతా శిశు ఆసుపత్రిలో భద్రత కేవలం కాగితాలకే పరిమితమైంది.రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనంలో కనీస భద్రతా ప్రమాణాలు లేకపోవడం, అత్యంత సున్నితమైన ఆసుపత్రి ప్రాంగణంలో నిఘా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం విమర్శలకు దారితీస్తోంది.

నిఘా కరువవ్వడంతో రోగులు, బాలింతలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది.గతంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నప్పుడు జరిగిన శిశువుల అపహరణ (కిడ్నాప్) ఘటనలు ఇంకా ప్రజల కళ్లముందే ఉన్నాయి.

నూతన భవనంలో పరిస్థితులు అంతకంటే దారుణంగా ఉందని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.ఆసుపత్రిలో అత్యంత కీలకమైన సీసీ కెమెరాలు లేకపోవడం అతిపెద్ద లోపం.

భద్రత కోసం కింద కేవలం ఒకరిద్దరు సెక్యూరిటీ సిబ్బంది తప్ప, ఆసుపత్రిలోని అంతస్తుల్లో ఎటువంటి నిఘా లేదు. ‘ప్రొటెక్షన్ ఫోర్స్’ వంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో, ఆసుపత్రి ప్రాంగణం తాగుబోతులకు, ఆకతాయిలకు అడ్డాగా మారుతోంది. రాత్రి వేళల్లో ఆకతాయిలు, తాగుబోతులు ఆసుపత్రిలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తుండటం కలకలం రేపుతోంది.

రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి ఆసుపత్రిలోకి దూసుకొచ్చి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగి, లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది.

అదృష్టవశాత్తూ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది, కానీ ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఉంటుందనే భయంతో బాలింతల తల్లిదండ్రులు రాత్రంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.ఆ వెంటనే సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రిని జల్లెడ పట్టి, నవజాత శిశువులను, చికిత్స పొందుతున్న పిల్లల భద్రతను పర్యవేక్షించాల్సి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో, ఎందుకో వచ్చాడో తెలియక గంటల తరబడి సిబ్బంది, రోగులు ఆందోళన చెందాల్సి రావడం ఇక్కడి భద్రతా వైఫల్యానికి నిదర్శనం.

ఒకవేళ ఆ వ్యక్తి ఏమైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటే బాధ్యులెవరు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఆసుపత్రి ప్రాంగణంలో పోలీసులు గానీ, కఠినమైన భద్రతా సిబ్బంది గానీ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.

ఎప్పుడు, ఏ దరిద్రం ముంచుకొస్తుందోనని రోగుల బంధువులు ఆసుపత్రి మెట్లపై, బయట భయంతో కూర్చుంటున్నారు.సీసీ కెమెరాల ఏర్పాటు ఏది? ప్రతి అంతస్తులో నిఘా పెంచాల్సిన అవసరం లేదా? పోలీస్ పహారా ఏది రాత్రి వేళల్లో భద్రతను పర్యవేక్షించేందుకు పోలీస్ సిబ్బందిని లేదా ప్రత్యేక నిఘా విభాగం అవసరం ఉందని వాపోతున్నారు.

ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని రోగుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.ఇప్పటికైనా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, బాధ్యతగా వ్యవహరించి రోగుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments