HomePOLITICAL NEWSచేనేత సహకార సంఘంలో బినామీలా!-18 ఏళ్ల తర్వాత ఎన్నికలు.. ఓటర్ల జాబితాలో బూటకపు పేర్లు-6 ఏళ్ల...

చేనేత సహకార సంఘంలో బినామీలా!-18 ఏళ్ల తర్వాత ఎన్నికలు.. ఓటర్ల జాబితాలో బూటకపు పేర్లు-6 ఏళ్ల వయసులో తండ్రి కావడమెలా? నిలదీస్తే ఏడీ నిర్లక్ష్య సమాధానం..

చేనేత కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన సహకార సంఘం.. కొందరు స్వార్థపరుల అక్రమాలకు అడ్డాగా మారింది. 2008లో జరిగిన ఎన్నికల తర్వాత సుదీర్ఘంగా 18 ఏళ్లు పట్టి.. ఎట్టకేలకు 2026లో ఎన్నికల గంట మోగింది. కానీ, ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచే అక్రమాల వాసన వస్తోంది.

సంఘంలోని కీలక బాధ్యులు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ అధికారులతో కుమ్మక్కై, తమ అధికారాన్ని ఉపయోగించి ఓటర్ల జాబితాను ‘మేనేజ్’ చేసినట్లు బయటపడుతున్న ఆధారాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.

చేనేత సంఘం ఓటర్ల జాబితాను పరిశీలిస్తే.. పాలకవర్గం చేసిన అక్రమాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. సహకార సంఘం చట్టం ప్రకారం ఓటు హక్కు ఉండాలంటే 18 ఏళ్లు నిండాలి. కానీ, పాలకవర్గంలోని ఒక కీలక బాధ్యుడి మన్మడికి ఇంకా 12 ఏళ్లు కూడా నిండలేదు.

ఆ చిన్నారి పేరును ఓటర్ల జాబితాలో చేర్చడం గమనార్హం. మరికొన్ని చోట్ల ఆశ్చర్యకరమైన లెక్కలు బయటపడ్డాయి. తండ్రి వయసు 37 ఏళ్లు, తల్లి వయసు 36 ఏళ్లు ఉంటే.. వారి కొడుకు వయసు 32 ఏళ్లుగా జాబితాలో చూపించారు.

అంటే, కేవలం 4 నుంచి 6 ఏళ్ల వయసులో ఆ తండ్రికి సంతానం కలిగిందని, వారు ఓటరుగా మారారని అధికారులు చెబుతున్న లెక్కలకు సామాన్యులు విస్తుపోతున్నారు. ఇలాంటి అసంబద్ధమైన లెక్కలతో వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్చి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.

గత 18 ఏళ్లలో ఎంతోమంది అసలైన చేనేత కార్మికులు మరణించారు. వారి స్థానంలో 200 మందికి పైగా వారి కుటుంబ సభ్యులను, మైనర్లను అక్రమంగా ఓటర్ల జాబితాలో చేర్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చనిపోయిన వారి ఓట్లను తొలగించకుండా, కొత్తగా తమకు అనుకూలమైన వారిని అక్రమంగా చేర్చుకోవడం ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలని చూస్తున్నారనేది స్పష్టమవుతోంది.

ఈ అక్రమాలపై బాధ్యతాయుతమైన ఏడీ అధికారిని అడిగితే.. “నువ్వు పడుకున్నావా? ఇన్ని రోజులు ఏమయ్యావు?” అని తిరిగి నిలదీయడం ఆ అధికారి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. బాధ్యత గల స్థానంలో ఉండి, అక్రమాలకు వత్తాసు పలుకుతూ, ఫిర్యాదు చేసేవారిపైనే ఎదురుదాడికి దిగడం వెనుక ఏముందోనని కార్మికులు అనుమానిస్తున్నారు.

చేనేత కార్మికుల అభ్యున్నతికి, వారి ఓటు హక్కును కాపాడాల్సిన సహకార సంఘం ఇలా తిమింగలాల కబంధహస్తాల్లో చిక్కుకోవడం బాధాకరం. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి, ఓటర్ల జాబితాపై సమగ్ర విచారణ జరిపించాలని, అర్హులైన వారికే ఓటు హక్కు కల్పించి, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాలని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments