కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
చదువుకునే విద్యార్థులు, మహిళలు కాంగ్రెస్ నాయకుల షోరూమ్‌ల నుంచి స్కూటీలు తీసుకెళ్లాలని తాను చేసిన వ్యాఖ్యకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. అలాగే కాంగ్రెస్ నేతల మెడలలోని బంగారు గొలుసులు తీసుకెళ్లాలన్న వ్యాఖ్య కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించే ఉద్దేశంతోనే చేశానని పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మాట్లాడుతున్నారని విమర్శించారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.
అదే జడ్జితో తాను ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి పనులపైనా విచారణ నిర్వహించాలని, అప్పుడు ఎవరు నిజాయితీగా పనిచేశారో, ఎవరు దొంగలో ప్రజలకు తెలుస్తుందన్నారు.
తప్పు చేసిన వారిపై ఏసీబీ వంటి సంస్థలతో విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు.విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా రాజకీయ ఉపన్యాసాలతో కాలం గడుపుతోందని ఆరోపించారు.
నిన్న ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి అధికార పార్టీ నాయకులు మద్దతు ఇవ్వడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలే ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎవరి పట్లా వ్యక్తిగత పగ, ప్రతీకారం లేదని, అయితే ఇంటి వరకు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
రాజకీయంగా, అభివృద్ధి అంశాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, మహేష్ కుమార్ గౌడ్ ముందుకు వస్తే బహిరంగంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు.
