HomePOLITICAL NEWSArmoorప్రైవేట్ ఆస్తులను దోచుకోవాలని చెప్పేవాళ్లు ప్రజాప్రతినిధులా.. దొంగలా? ఎమ్మెల్యే పైడి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్...

ప్రైవేట్ ఆస్తులను దోచుకోవాలని చెప్పేవాళ్లు ప్రజాప్రతినిధులా.. దొంగలా? ఎమ్మెల్యే పైడి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ ఫైర్..

ప్రైవేట్ ఆస్తులను దోచుకోవాలని ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడటం అత్యంత బాధ్యతారాహిత్యమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే దోపిడీని ప్రోత్సహించేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని అన్నారు.

అలాంటి వ్యాఖ్యలు చేసే వారు ప్రజాప్రతినిధుల్లా కాకుండా దొంగల్లా మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా బీజేపీ నేతలు తమ అసలు వైఖరిని బయటపెట్టుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో పన్నెండు ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాల హామీని ఏమి చేసిందో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో పేదల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటోందన్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించకపోవడం దురదృష్టకరమన్నారు.

నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీతో న్యాయం కోసం డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జీలు, ప్రజాస్వామ్య హక్కుల అణచివేత చూస్తుంటే దేశం నియంత పాలనలో ఉందేమో అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.


పదేళ్ల పాలన–ప్రజాపాలనపై చర్చకు సిద్ధం
పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ రెండున్నరేళ్ల ప్రజాపాలనకు మధ్య బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.

ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమని, పదేళ్ల పాలనలో నిరుద్యోగులను మోసం చేసినవారే ఇప్పుడు ఉద్యోగాల పేరుతో దొంగ ఏడుపు ఏడుస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గోదావరిలో పోశారని ఆరోపించారు.

అన్ని తానై వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు తనకు సంబంధం లేదని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. హరీశ్‌రావు ఇరిగేషన్ వైఫల్యాలకు కేంద్రబిందువుగా ఉన్నారని, ఇప్పుడు కరువు పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు.

బావ–బామ్మర్దుల పాలనలో వేలాది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినా పట్టించుకోలేదని అన్నారు. వారి పదేళ్ల పాలనలో సుమారు 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించిందని చెప్పారు.

ఎన్నికల హామీల్లో మెజారిటీని ఇప్పటికే అమలు చేశామని, రూ.20 వేల కోట్లకు పైగా రైతు రుణమాఫీ, పేదలకు ఉచిత బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి మూడు వేలకుపైగా ఇళ్లు మంజూరు చేశామని, రాష్ట్రంలో 70 శాతానికి పైగా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నా, వాటిని నమ్మే పరిస్థితి ఇక లేదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి, మేయర్ ఉమారాణి,గడుగు గంగాధర్, మానాల మోహన్, తహర్బిన్ హందాని,బొబ్బిలి రామకృష్ణ, కేశ వేణు, అరికెల నర్సారెడ్డి, చంద్రశేఖర్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments