HomeCRIMEకంపెనీ లాకర్‌లో కన్నం.. అన్నదమ్ముల అరెస్ట్..కిలో బంగారం రికవరీ..

కంపెనీ లాకర్‌లో కన్నం.. అన్నదమ్ముల అరెస్ట్..కిలో బంగారం రికవరీ..

టాస్క్‌ఫోర్స్,బంజారాహిల్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో కేసు ఛేదన తాను పనిచేస్తున్న సంస్థలోని బంగారు ఆభరణాలపై కన్నేసిన ఓ ఉద్యోగి, సొంత సోదరుడితో కలిసి పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్), బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. కోట్ల విలువైన 1 కిలో 28.59 గ్రాముల బంగారు ఆభరణాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ (టాస్క్‌ఫోర్స్) గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు.

ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ జిల్లా భాల్కి తాలూకా మారోర్ జోల్దప్కా గ్రామానికి చెందిన సన్ కాంబ్లే హరీష్ (29), సన్ కాంబ్లే ఆకాష్ (25) సొంత అన్నదమ్ములు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌లో నివసిస్తున్నారు.

హరీష్ ‘గురుకృపా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుండగా, ఆకాష్ హైటెక్ సిటీలోని పీడబ్ల్యూసీ లో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. హరీష్ విధుల్లో భాగంగా హైదరాబాద్‌లోని ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌లైన కృష్ణ పర్ల్స్ , శ్రీ జ్యువెలర్స్, అపర్ణ జ్యువెలర్స్, జోయాలుక్కాస్, మనేపల్లి జ్యువెలర్స్, తదితర షోరూమ్‌లకు కొత్త గోల్డ్, డైమండ్ డిజైన్లను చూపిస్తూ ఆర్డర్లు తీసుకొచ్చేవాడు.

అనంతరం కంపెనీ నుంచి ఆభరణాలను తీసుకెళ్లి ఆయా షోరూమ్‌లకు డెలివరీ చేసి, వారి నుంచి చెక్కులు సేకరించి కార్యాలయంలో జమ చేసేవాడు. దీంతో కంపెనీ లాకర్‌లో నిల్వ ఉంచిన బంగారు ఆభరణాలపై అతడికి పూర్తి సమాచారం ఏర్పడింది.ఆర్థిక ఇబ్బందుల కారణంగా లాకర్‌లోని బంగారు ఆభరణాలను దొంగిలించాలని హరీష్ నిర్ణయించుకున్నాడు.

ఈ విషయాన్ని తన సోదరుడు ఆకాష్‌కు చెప్పగా, అతడూ అంగీకరించాడు. జులై 16న మొదట కార్యాలయంలో రెక్కీ నిర్వహించి చోరీకి ప్రయత్నించినా అది విఫలమైంది. మరుసటి రోజు జులై 17న హరీష్ కార్యాలయానికి వెళ్లి ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు.

అనంతరం బాత్రూమ్ గ్రిల్‌ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి లాకర్‌లోని బంగారు ఆభరణాలను అపహరించాడు. ఆ ఆభరణాలను బయటకు తీసుకొచ్చి తన సోదరుడు ఆకాష్‌కు అప్పగించగా, అతడు వాటిని తన వద్ద దాచిపెట్టాడు.

నేరం చేసే సమయంలో తమ గుర్తింపును దాచేందుకు కూడా ప్రయత్నించారు.చోరీపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి మంగళ్‌హాట్‌లో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి ఏడు బంగారు నెక్లెస్‌లు, ఏడు జతల బంగారు కమ్మలు కలిపి మొత్తం 1 కిలో 28.59 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్‌ను టాస్క్‌ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్ ఇన్‌స్పెక్టర్ ఛత్రాసింగ్ యాదేందర్, ఎస్‌ఐ మహమ్మద్ జాహెద్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, బంజారాహిల్స్ డిఐ కవియోద్దీన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments