పోలీసులు–అగ్నిమాపక శాఖ సాహసంతో సురక్షితంగా బయటపడిన ప్రయాణికులుక్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకుండపోత వర్షంతో ఉప్పొంగిన వరద నీటిలో చిక్కుకున్న పెళ్లి బస్సులోని 45 మంది ప్రయాణికులను పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు.
కామారెడ్డి పట్టణంలోని సుభాష్రోడ్ చౌరస్తా వద్ద సోమవారం అర్ధరాత్రి వరద ఉద్ధృతి పెరగడంతో బస్సు నీటిలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులందరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.
అనంతరం ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేసి వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ ఘటన నేపథ్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. పెద్ద చెరువు, గురు రాఘవేంద్ర కాలనీ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువులు, వాగులు, కల్వర్టులు, వరద ప్రవాహ ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
సెల్ఫీలు, వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని హెచ్చరించారు. చిన్నారులను అప్రమత్తంగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వరదలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా రక్షించిన పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
