HomeTelanganakamareddyకుండపోతకు కామారెడ్డి అతలాకుతలం182.5 మి.మీ. వర్షపాతం

కుండపోతకు కామారెడ్డి అతలాకుతలం182.5 మి.మీ. వర్షపాతం

.. రాష్ట్రంలోనే అత్యధిక నమోదుజిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగింపుపొంగిపొర్లుతున్న వాగులు.. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు.. పలు గ్రామాలకు తెగిన రాకపోకలు.. కుండపోత వర్షం కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో జిల్లా మొత్తం జలమయమైంది.

జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరోవైపు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కామారెడ్డి జిల్లాలో నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ఉధృతంగా పారుతుండగా, మాచారెడ్డి, తాడ్వాయి, దోమకొండ, బిక్కనూర్, రాజంపేట మండలాల్లోని వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

తాడ్వాయి మండలం కాళోజీవాడి గ్రామ వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక గ్రామీణ రహదారులపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షం ప్రభావం తీవ్రంగా కనిపించింది.

సుభాష్ టాకీస్ ప్రాంతం, సైలాని బాబా కాలనీ, టీచర్స్ కాలనీ, విద్యానగర్, బతుకమ్మ కుంట ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో గృహోపకరణాలు దెబ్బతిన్నాయి.

పలుచోట్ల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సహాయక చర్యల కోసం అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాలతో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కామారెడ్డి జిల్లాలో నమోదైంది.

జిల్లా ఐడీఓసీ పరిధిలో 182.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై తొలి స్థానంలో నిలిచింది. పిట్లంలో 127 మిల్లీమీటర్లు, మాక్దూంపూర్‌లో 124.5 మిల్లీమీటర్లు, గాంధారిలో 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 12 ప్రాంతాల్లో భారీ, 15 ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు.

జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments