HomeTelanganaNizamabadఎస్‌ఐఆర్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల తీరుపై సీతక్క అసంతృప్తిఓటరు జాబితా సవరణలో ఆశించిన స్థాయిలో చురుకుదనం లేదు.....

ఎస్‌ఐఆర్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల తీరుపై సీతక్క అసంతృప్తిఓటరు జాబితా సవరణలో ఆశించిన స్థాయిలో చురుకుదనం లేదు.. ప్రతి ఓటును కాపాడుకోవాల్సిందేనని సూచన

నిజామాబాద్‌ ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్‌ శ్రేణులు ఆశించిన స్థాయిలో చురుగ్గా పనిచేయడం లేదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పార్టీకి బలమైన క్యాడర్‌ ఉన్నప్పటికీ ఓటరు జాబితా సవరణలో కనిపిస్తున్న నిర్లక్ష్యం భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు.

అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో కాపాడుకోవడం పార్టీ శ్రేణుల ప్రధాన బాధ్యతగా భావించాలని స్పష్టం చేశారు.బుధవారం నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఉమ్మడి జిల్లా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2)పై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, రాష్ట్రంలో అత్యధిక సర్పంచి స్థానాలను గెలుచుకున్న ఘనత జిల్లాకు దక్కిందని గుర్తుచేశారు. ఈ విజయాల వెనుక కార్యకర్తల కష్టం ఉందన్నారు. అదే స్ఫూర్తిని ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలోనూ చూపించాలని సూచించారు.

ప్రతి బూత్‌ పరిధిలో బీఎల్‌వోలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సీతక్క సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అర్హులైన వారి పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని అన్నారు. సవరణలు, అభ్యంతరాలు, తొలగింపుల విషయంలో నిబంధనల ప్రకారం పరిశీలన చేసి ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా గల్లంతుకాకుండా చూడాలని తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని మంత్రి అన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతైతే దాని ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడుతుందని హెచ్చరించారు. ఓటర్ల జాబితా విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలే తారుమారయ్యే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌, బిహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలను పార్టీ శ్రేణులు గమనించాలని సూచించారు.

సర్పంచి నుంచి డీసీసీ, ఎమ్మెల్సీ, ఎంపీ, ఇన్‌చార్జి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై దృష్టి సారించాలని సీతక్క అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ నాయకత్వంలో సమన్వయంతో పనిచేసి ప్రతి ఓటును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

మండల, గ్రామ కాంగ్రెస్‌ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని సూచించారు. *ఓటు హక్కును కాపాడటమే కాంగ్రెస్‌ లక్ష్యం* టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడమే కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగించుకుంటోందని విమర్శించారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్‌ పార్టీ బీఎల్‌ఏలు గత రెండున్నర నెలలుగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తున్నారని తెలిపారు.

బీఎల్‌ఏలు సుమారు 35 వేల పేర్ల జాబితాను సమర్పించగా, ఎన్నికల సంఘం వద్ద కేవలం 13 వేల మంది మాత్రమే నమోదైనట్లు చూపించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో సుమారు 20 శాతం ఓట్లు తొలగించబడగా, మరో 40 శాతం ఓట్లకు నోటీసులు జారీ చేయడం ఆందోళనకరమన్నారు.

ప్రతి ఓటరు తమ ఓటు నమోదును తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, తప్పులు ఉంటే వెంటనే సవరణలు చేసుకోవాలని ఆయన సూచించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని గుర్తు చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి ఓటు విలువైనదని పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షించేలా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌, ఎంపీ సురేష్‌ షెట్కర్‌, మేయర్‌ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments