నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ హాజరైన వేళ.. బాన్సువాడ రాజకీయాలు వేడెక్కాయి.ఇటీవల పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ మేరకు పోచారం వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సమావేశం వేదిక గేటు వద్ద ధర్నాకు దిగారు. పార్టీ మారిన అనంతరం కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌లోకి వచ్చి పార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశానికి పోచారం హాజరైన నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పార్టీ అధిష్ఠానం సమక్షంలోనే వర్గ విభేదాలు బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారింది. బాన్సువాడ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలకు వెంటనే పరిష్కారం చూపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
