నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామ శివారులో మొరం అక్రమ తవ్వకాలు, తరలింపుపై గ్రామస్తులు కన్నెర్ర చేశారు. అనుమతులు లేకుండా మోరం తవ్వుతూ టిప్పర్లలో తరలిస్తున్నారంటూ సుమారు 5 నుంచి 10 వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. వాహనాలను నిలిపివేసి వేబిల్లులను పరిశీలించగా.. ప్రస్తుతం జరుగుతున్న తరలింపునకు సంబంధం లేని ఐదు నెలల కిందటి వేబిల్లులను చూపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.
దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.మోరం అక్రమ తవ్వకాలు, తరలింపు వెనుక అధికార పార్టీకి చెందిన కొందరి అండదండలు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపించారు. మోరం తరలింపుపై గతంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. తాజాగా భారీగా టిప్పర్లు తిరుగుతుండటంతో ఆగ్రహించిన వారు వాటిని అడ్డుకుని నిలదీశారు.
అక్రమంగా మోరం తరలిస్తున్న వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అడ్డుకున్న మోరం టిప్పర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి.. మోరం తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? లేవా ప్రస్తుతం చూపిస్తున్న వేబిల్లులు చెల్లుబాటవుతాయా అనే అంశాలను తేల్చాలని వారు డిమాండ్ చేశారు.మోరం నిర్వాహకులు, సంబంధిత వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
