కేసుల దర్యాప్తు, నేర గణాంకాల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వం పాటిస్తూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని సీసీఆర్బీ విభాగాన్ని ఆయన సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, నేర గణాంకాలు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల నుంచి అందుతున్న కేసుల వివరాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు.
పెండింగ్‌లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.నేరాలకు సంబంధించిన సమగ్ర గణాంకాలను సిద్ధం చేసి, వాటి ఆధారంగా నేర నియంత్రణకు వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని కమిషనర్ తెలిపారు.
సీసీఆర్బీ విభాగం, పోలీస్ స్టేషన్ల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు.కేసుల దర్యాప్తు, పురోగతికి సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు సకాలంలో అందించాలని, పోలీస్ శాఖ పనితీరు మరింత సమర్థవంతంగా ఉండేలా సీసీఆర్బీ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
సమీక్షలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, సీసీఆర్బీ ఏసీపీ బి. గురు నాయుడు, సీఐ ఆర్. అంజయ్య, పాండేరావు, ఎస్ఐ జే. వరప్రసాద్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
