నిజామాబాద్ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనం, కారును చోరీ చేసిన నిందితుడిని రెండవ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వాహనాలను రికవరీ చేసినట్లు ఎస్‌ఐ యాదగిరిగౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బర్కత్‌పురా ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
నవీపేట మండలం ఫతేనగర్‌కు చెందిన అబ్దుల్ సల్మాన్‌ఖాన్ (30) విద్యుత్ పనులు చేస్తుంటాడు. ఇతడు టౌన్-2 పరిధిలో హోండా యాక్టివా స్కూటీని, టౌన్-4 పోలీస్‌స్టేషన్ పరిధిలో మహీంద్రా ఎక్స్‌యూవీ-500 కారును చోరీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ యాదగిరిగౌడ్ సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్టు చేశారు.
అతని వద్ద నుంచి చోరీకి గురైన హోండా యాక్టివా స్కూటీ, మహీంద్రా ఎక్స్‌యూవీ-500 కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ యాదగిరిగౌడ్ తెలిపారు.
