నగరంలో రౌడీమూకలు మరోసారి చెలరేగిపోయాయి.‘నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా..?’ అంటూ కక్ష పెంచుకున్న రౌడీషీటర్ తన అనుచరులతో కలిసి ఓ వ్యక్తి ఇంటిపైకి వెళ్లి దాడి చేశాడు. అర్ధరాత్రి ఇంటి వద్దకు చేరుకున్న మూక కారు అద్దాలు పగులగొట్టి, ఇంటి తలుపులు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గతంలో నేర కేసుల్లో పేరు ఉన్న వ్యక్తి మరోసారి ఇలా రెచ్చిపోవడం ధర్మపురిహిల్స్లో కలకలం రేపింది.నిజామాబాద్ ఆరవ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ధర్మపురిహిల్స్కు చెందిన నోమన్ మొబైల్ ఫోన్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ ఇర్ఫాన్ ఇటీవల నోమన్ వద్దకు వెళ్లి ఫోన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. తన వద్ద ఫోన్ లేదని నోమన్ చెప్పడంతో ఇర్ఫాన్ బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
నాకే ఫోన్ ఇవ్వవా నీ వంతు చూస్తాను అంటూ బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. దీంతో భయపడిన నోమన్ స్థానిక ఆరవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదుపైనే కక్ష పెంచుకున్న ఇర్ఫాన్.. తన తండ్రి ఖరీం లాలా, మరికొందరితో కలిసి మంగళవారం రాత్రి నోమన్ ఇంటి వద్దకు వచ్చినట్లు బాధితుడు ఆరోపించాడు.
మూకగా వచ్చి ఇంటి ముందు ఉన్న కారును పగులగొట్టి, ఇంటి తలుపులను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఇర్ఫాన్,అతని తండ్రి కరీంలాల్ లపై గతంలో హత్య కేసులు నమోదైనట్లు, రౌడీషీట్ కూడా ఉన్నట్లు సమాచారం. గంజాయి కేసులోనూ అతని పేరు ఉన్నట్లు సమాచారం.
తాజా ఘటనపై నోమన్ మళ్లీ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి అనంతరం ఇర్ఫాన్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
అతని తండ్రి ఖరీం లాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. రౌడీషీటర్ మరోసారి రెచ్చిపోయిన ఘటనతో ధర్మపురిహిల్స్ ప్రాంతంలో భయాందోళన నెలకొంది.
