HomeTelanganaNizamabadఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రైతులకు మరింత ప్రయోజనం..ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రైతులకు మరింత ప్రయోజనం..ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

అనువైన స్థలం కోసం లక్కంపల్లి సెజ్ భూముల పరిశీలన

రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమల ఏర్పాటుకు సైతం కృషి చేస్తామని వెల్లడి

జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానిక రైతాంగానికి మరింత ప్రయోజనాలు చేకూరుతాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం ఆయిల్ పామ్ ఇండస్ట్రీ నెలకొల్పేందుకు నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ కు ఆనుకుని ఉన్న స్థలాలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. సెజ్ ప్రాంతంలో ఫ్యాక్టరీ కోసం గుర్తించిన స్థలం అనుకూలతపై అధికారులతో చర్చించారు.

భవిష్యత్తులో ఇదే ప్రాంతంలో రిఫైనరీ ఏర్పాటుకు సైతం స్థలం అందుబాటులో ఉండడం, పొరుగున ఉన్న నిర్మల్ జిల్లాకు 50 కిలోమీటర్ల లోపే చేరువగా ఉండడం, రెండు జిల్లాలలో ఇప్పటికే 17వేల ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగులో ఉండడం, మరో ఐదు వేల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉండడం వంటి అంశాలు స్థానికంగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూలంగా నిలుస్తాయని అధికారులు అభిప్రాయపడ్డారు.

సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. స్థల నిర్ధారణ జరిగిన వెంటనే ఆయిల్ పామ్ ఫాక్టరీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంసిద్ధత తెలిపారని అన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు కూడా ఆయిల్ పామ్ సాగుకు స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఎంతో లాభదాయకమైన ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున తోడ్పాటును అందిస్తోందని, ఈ అవకాశాన్ని జిల్లా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వంట నూనె తయారీతో పాటు ఇతర అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్ పామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా 75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం పది శాతం విస్తీర్ణంలోపే ఈ పంట సాగు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల ఇతర దేశాల నుండి వంట నూనె నిల్వలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సి రావడం భారంగా పరిణమించిందని, స్థానికంగానే ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే, రైతులు అధిక లాభాలు ఆర్జించడంతో పాటు ప్రజలకు కూడా మేలు చేసిన వారవుతారని అన్నారు.


జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుతో రైతులకు గణనీయమైన లాభాలు సమకూరడమే కాకుండా, ఆయిల్ పామ్ ఇండస్ట్రీ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్కంపల్లి సెజ్ ప్రాంతంలోని రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమలను కూడా నెలకొల్పేందుకు స్థలాలు అందుబాటులో ఉన్నందున వీటి ఏర్పాటుకు కూడా కృషి చేస్తామని అన్నారు.

అంతేకాకుండా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సేంద్రీయ విధానం ద్వారా చేపడుతున్న కూరగాయల సాగు పద్ధతులను అధ్యయనం చేసి, ఇక్కడ కూడా అదే తరహాలో కూరగాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహిస్తామని అన్నారు.

ఇదిలాఉండగా, ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియనందున రైతులు నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వినియోగించాలని, చుక్క నీరు కూడా వృధా కాకుండా చూసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి హితవు పలికారు.

నీటి లభ్యత అంతగా లేనందున యాసంగిలో వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు. స్థల పరిశీలన జరిపిన వారిలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments