ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలుఅర్ధరాత్రి వేళల్లో రహదారులు, చెరువులు, పార్కుల వద్ద పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు. ముఖ్యంగా యువత బాధ్యతగా వ్యవహరించాలని, పిల్లల కదలికలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సంతోషంగా జరగాల్సిన వేడుకలు నిర్లక్ష్యం కారణంగా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపడం బాధాకరమని పేర్కొన్నారు. ఇటీవల ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి, ఓ కుటుంబసభ్యుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో ఆయన ఈ సూచనలు చేశారు.
రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని సజ్జనార్ తెలిపారు. చిన్నారి పుట్టినరోజు రోజే ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారని, ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్‌బండ్‌పై ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించినట్లు సీపీ తెలిపారు. ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితులపై వివిధ ప్రభుత్వ విభాగాలతో సమగ్రంగా చర్చించినట్లు వెల్లడించారు.
రహదారులపై భద్రతను మెరుగుపరిచేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వేడుకల పేరుతో రాత్రివేళల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని సూచించారు.
