- బంధువులు, బినామీల ఇళ్లలోనూ తనిఖీలు.. నగదు, బంగారం స్వాధీనం
పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి ఆస్తుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మహబూబాబాద్ కలెక్టరేట్‌లో ఆ శాఖ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వాసంశెట్టి నరసింహారావుకు సంబంధించిన కార్యాలయం, నివాసంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువులు, బినామీల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.- ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో ఖమ్మంలో రెండు విలాసవంతమైన భవనాలు, హైదరాబాద్‌లో పలు ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.నరసింహారావు సుమారు 15 ఏళ్లుగా ప్రభుత్వ సేవలో ఉన్నారు.
- ఈ కాలంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పనిచేశారు. ఆయన విధులు నిర్వహించిన ప్రాంతాల్లో అవినీతికి సంబంధించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆస్తుల వివరాలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆయనకు సంబంధించిన వివిధ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు.
- సోదాల్లో భాగంగా రూ.19 వేల నగదు, బంగారం, నాలుగు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో గుర్తించిన ఆస్తుల వివరాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల విలువపై మరింత సమాచారం సేకరిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత మొత్తం ఆస్తులు, వాటి విలువ, ఇతర లభించిన ఆధారాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
