విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిజామాబాద్‌లో ఆదివారం సైకిల్, బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
పూలాంగ్ చౌరస్తా వద్ద శుభం ప్రకాష్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పూలాంగ్ చౌరస్తా నుంచి ప్రగతి ఆస్పత్రి, ఎల్‌ఐసీ చౌరస్తా, కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ కొనసాగింది. పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శుభం ప్రకాష్ మాట్లాడుతూ.. దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నక్సలైట్లు, మతతత్వ శక్తులు, ఇతర సవాళ్లను ఎదుర్కొంటూ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత కోసం పలువురు పోలీసులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు.
వారి త్యాగాల ఫలితంగానే ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని పేర్కొన్నారు.నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల సేవలు చిరస్మరణీయమన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రజలు సహకరించాలని, ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
పోలీసు కుటుంబాలను పరామర్శించడం కూడా సంస్మరణ వారోత్సవాల్లో భాగమని తెలిపారు. పోలీసులంతా ఒకే కుటుంబమని, యూనిఫాం ధరించడం గర్వకారణమని పేర్కొంటూ.. న్యాయం, నిష్పక్షపాత సేవ పట్ల ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఉండాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఆర్మ్‌డ్ రిజర్వ్, స్పెషల్ పార్టీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
