పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు -సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఇద్దరిపై కేసులు
కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ జిల్లా కేంద్రంలోని జీవదాన్ స్కూల్ లో చోటు చేసుకున్న ఘటన దురదృష్టకరమని,దీనికి కారణమైన పీఈటీ నాగరాజు పై బీఎంఎస్, పోక్సోకేసు లు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్పీసింధూశర్మ తెలిపారు.
బుధవారం ఉదయం ఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 23న తల్లిదండ్రుల ద్వారా అందిన ఫిర్యాదు మేరకు పీఈటీపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
నిందితుడికి కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. స్కూల్ వద్ద జరిగిన గొడవలో సీఐ చంద్రశేఖర్ రెడ్డితోపాటు నలుగురు పోలీసులు గాయపడ్డారన్నారు. అల్లర్లను ప్రేరేపించిన వ్యక్తులనుగుర్తిస్తున్నామని, పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
బాలికపై ఎలాంటి భౌతిక గాయాలు లేవన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని తెలిపారు.
సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని సింధూశర్మ కోరారు. పూర్తి స్థాయి విచారణ జరిపి కేసులు నమోదు చేస్తామన్నారు.
