HomeLaw and Orderఅటవీ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం..పోలీసు–అటవీశాఖల సంయుక్త కార్యాచరణ..

అటవీ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం..పోలీసు–అటవీశాఖల సంయుక్త కార్యాచరణ..

జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలను అరికట్టడంతో పాటు ఇప్పటికే జరిగిన ఆక్రమణలను తొలగించేందుకు పోలీసు శాఖ, అటవీశాఖ సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాయి. ఈ మేరకు గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ అండ్ కంట్రోల్ హాల్‌లో ఇరు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

సమావేశానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు.పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. అటవీ భూముల ఆక్రమణలు ప్రభుత్వ ఆస్తికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

అక్రమ నిర్మాణాలు, చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణా, అక్రమ మైనింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. డ్రోన్ సర్వేలు, జియో ట్యాగింగ్, క్రమానుగత తనిఖీల ద్వారా ఆక్రమణలను గుర్తించి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సమాచారం అందిన వెంటనే పోలీసు, అటవీశాఖలు సంయుక్తంగా స్పందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ మాట్లాడుతూ.. అటవీ భూముల పరిరక్షణ ప్రతి ప్రభుత్వ శాఖతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. భూముల సరిహద్దుల గుర్తింపు, కేసుల నమోదు, కోర్టు వ్యవహారాల్లో సమన్వయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

అటవీ భూముల ఆక్రమణలను గుర్తించి దశలవారీగా తొలగింపు.అక్రమ చెట్ల నరికివేత, కలప రవాణాపై ప్రత్యేక నిఘా. పోలీసు–అటవీశాఖల మధ్య సమాచార మార్పిడిని వేగవంతం చేయడం.సంయుక్త తనిఖీలు, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడం.డ్రోన్లు, జీపీఎస్ మ్యాపింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెంపు.చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు.ప్రజల్లో అటవీ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు.

సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టి కొత్త ఆక్రమణలను అడ్డుకోవడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు, అటవీశాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments