నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాస్థాన్-1, జాతీయ రహదారి-63 వద్ద ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు రాజస్థాన్‌కు చెందిన యోగేంద్ర సింగ్‌ను అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు.
మరో నిందితుడు బాలుడు (జువైనల్) కావడంతో అతడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 4న గంగాస్థాన్-1 వద్ద మిర్చి బండి నిర్వహిస్తున్న బొమ్మగోని పద్మ మెడలోని బంగారు పుస్తెల తాడును ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లాక్కొని పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు ప్రధాన నిందితుడు యోగేంద్ర సింగ్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.
నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకోవడంతో పాటు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.
