నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా కీలక వైద్య సేవలను స్థానికంగానే అందించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
అయితే ఎన్నో ఏళ్లుగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు ఊతమిచ్చేలా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఉన్నతస్థాయి అధికారులు సమీక్ష నిర్వహించడంతో జీజేహెచ్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి.
సమీక్ష అనంతరం ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి, ఆసుపత్రిలోని వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు వైద్యారోగ్య శాఖ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)ను బుధవారం నిజామాబాద్‌కు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది.మంత్రి ఆదేశాల మేరకు బుధవారం జీజేహెచ్‌ను సందర్శించిన ఎండీ ఆసుపత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రతి విభాగంలో ఉన్న లోటుపాట్లను నమోదు చేయడంతో పాటు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అదనపు సిబ్బంది, మౌలిక వసతులు, వైద్య పరికరాలు, అవసరంపై సమగ్ర వివరాలను సేకరించారు.
త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, దాని ఆధారంగా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలను సమీక్షిస్తూ, అవసరమైన మౌలిక వసతులు, పరికరాలు, వైద్య సిబ్బంది నియామకంపై అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
స్పెషాలిటీ హోదా లభిస్తే జిల్లావాసులకు కార్డియాలజీ (గుండె వ్యాధులు), న్యూరాలజీ (మెదడు, నరాల సంబంధిత వ్యాధులు), నెఫ్రాలజీ (మూత్రపిండాల వైద్యం), యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, పల్మనాలజీ, ఎండోక్రైనాలజీ, ఆంకాలజీ (క్యాన్సర్ వైద్యం), ఆర్థోపెడిక్ సూపర్ స్పెషాలిటీ వంటి విభాగాల్లో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అలాగే అత్యాధునిక ఎంఆర్ఐ స్కానింగ్, మరొక ఆక్సిజన్ ప్లాంట్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం సంక్లిష్ట వ్యాధులతో బాధపడుతున్న రోగులు హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలతో పాటు కామారెడ్డి, నిర్మల్ తదితర సమీప జిల్లాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
అత్యవసర పరిస్థితుల్లో సమయానికి చికిత్స లభించడం వల్ల ప్రాణనష్టం కూడా తగ్గే అవకాశం ఉంది.జిల్లా కేంద్రంలోనే అధునాతన చికిత్సలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.
మంత్రి సమీక్షతో ప్రారంభమైన ఈ ప్రక్రియ జీజేహెచ్ చరిత్రలో కీలక మలుపుగా మారనుందనే అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తమవుతోంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు పూర్తయితే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఉత్తర తెలంగాణలో ప్రముఖ వైద్య కేంద్రంగా అవతరించడంతో పాటు, పేదలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువ కానుంది.
